సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి టీడీపీ కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకుని పోరాడడం వల్లే ఘన విజయం సాధ్యమైందన్నారు. పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని, పోరాడిన వారికి తప్పకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. సోమవారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, పార్లమెంట్ అధ్యక్షులు, పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ విజయం కోసం కష్టపడినవారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. పార్టీ నేతల నివేదికలతో పాటు, ఇతర మార్గాల్లో కూడా రిపోర్టులు తెప్పించుకుని, కష్టపడిన వారికే పదవులు వచ్చేలా చేస్తామని తెలిపారు. ‘ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల పాటు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, యువగళం, రా.. కదలిరా, ప్రజాగళం వంటి వివిధ కార్యక్రమాలతో ప్రజలతోనే ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులను కూడా సందర్శించి, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాం. గత ఐదేళ్లూ కార్యకర్తలు, నాయకులపై వైసీపీ సర్కార్ ఎన్నో అక్రమ కేసులు పెట్టింది. వీటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పని చేయడం వలెనే గెలిచామన్నారు.