వాస్తవాల్ని వార్తలుగా ప్రచారం చేస్తామని చెప్పుకొని దుకాణాలు తెరిచిన కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలు, దొంగ వార్తలు, తప్పుడు సమాచారంతో ప్రజల మనసుల్లో విషాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల టార్గెట్ రీచ్ అయిన తర్వాత కూడా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయడం, చూపించడం ఆపకపోవడం వాళ్ల కిరాతకమైన మానసిక నైజానికి అద్దం పడుతోందన్నారు. రామోజీరావు లేరనుకుంటే వాళ్ల అబ్బాయి ఉన్నట్టున్నారని, ఆయన పేపర్లో తప్పుడు, విషపు వార్త రాశారన్నారు. వైయస్ జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంత మంది బయటకెళ్తే రెండు మూడింతలు.. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రూ.296 కోట్లు అని వార్త అచ్చేశారన్నారు. ఇంత దుర్మార్గపు రాతలా? అని ప్రశ్నించారు.