పంటలకు నీటి తడులందించేందుకు పొలాల్లోని బోరు బావులకు అమర్చిన ఆరు విద్యుత్ సబ్ మెర్సిబుల్ మోటార్లు గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్ళారు. ఒకేరోజు రెండు గ్రామాల పరిధిలో జరిగిన ఈ ఘటనతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బాధితుల కథనం మేరకు పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలంలోని సొలస గ్రామానికి చెందిన రైతు, ఎంపీటీసీ సభ్యుడు మద్దూరి శ్రీనివాసరెడ్డి గ్రామపరిధిలో నిమ్మతోట సాగుచేస్తుండగా అదే గ్రామానికి చెందిన వెంకట్రావు జామతోట సాగు చేస్తున్నాడు. శ్రీనివాసరెడ్డి మొక్కలకు నీటి తడులను అందించేందుకు పొలంలో బోరువేసి 5హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన మూడు మోటార్లను అమర్చగా, వెంకట్రావు 5హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన ఒక మోటారును అమర్చాడు. రోజులాగే శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి మోటార్లు అన్‌చేసేందుకు ఉపక్రమించగా మోటార్లు, నీటి పైపులు, విద్యుత్ వైర్లు కానరాలేదు. దీనితో మోటార్లు చోరికి గురైనట్లు గుర్తించారు. అలాగే చెంఘీజ్‌ఖాన్‌పేటలో పంచాయతీ రక్షిత తాగునీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంక్‌కు నీరు ఎక్కించేందుకు ఏర్పాటుచేసిన 1..5హెచ్‌పి సామర్ధ్యం కలిగిన రెండు విద్యుత్ మోటార్లు కూడా చోరీకి గురయ్యాయి. శుక్రవారం ఉదయం విధులకు హాజరైన పంచారుతీ సిబ్బంది మోటార్లు, కరెంటు తీగ, పైపులు చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీకి గురైన 5హెచ్‌పి మోటార్ల విలువ రూ.2..80లక్షలు ఉంటుందని రైతులు తెలుపగా, 1.5 హెచ్‌పి మోటార్ల విలువ రూ.1.25లక్షలు ఉంటుందని పంచాయతీ సిబ్బంది తెలిపారు. చోరీపై రైతులు, పంచాయతీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.