టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలని ప్రారంభించిన టిడ్కో ఇళ్ల లక్ష్యాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆరోపించారు. శుక్రవారం పార్వతీపురం పరిధిలోని అడ్డాపుశీల ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇక్కడ కూడా అవినీతి జరిగిందని, పేదవారినీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వదలలేదని ఆరోపించారు. 2018లో టిడ్కో లబ్ధిదారుల జాబితాను రూపొందించారని.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ జాబితాను పూర్తిగా మార్చివేసి తమ కార్యకర్తలకు ఇళ్లు కేటాయించిందని ఆరోపించారు. ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన వారు వడ్డీలు కట్టలేక అప్పుల పాలయ్యారని... ఇళ్లు కూడా దక్కలేదని విచారం వ్యక్తం చేశారు. గతంలో ఇళ్ల కోసం డీడీల రూపంలో డబ్బులు చెల్లించిన వారికి న్యాయం చేస్తామని, వారికి ఇళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, బార్నాల సీతారాం, కోరాడ నారాయణరావు, డాక్టర్ భానుప్రసాద్, జి.రవికుమార్, పెంట సత్యం, వెంకటప్పలనాయుడు, అక్కేన శివ, కోలా మధు, పాలకొండ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.