కర్నూలు నగరంలో నిలిచిన రోడ్ల విస్తరణ పనులను సత్వరమే ప్రారంభించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహరశుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ అతిథి గృహంలో నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..... ప్రధానంగా కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కళాశాల మీదుగా జమ్మిచెట్టు వరకు, పాతబస్టాండు డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి తుంగభద్ర నది తీరాన రాఘవేంద్ర మఠం, మాసుంబాషా దర్గా నుంచి పూలబజార్ పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల విస్తరణలో దుకాణాలు, భవనాలు కోల్పోతున్న యజమానులను సంప్రదించాలని అధికారులను ఆదేశించారు. చౌక్‌బజార్ నుంచి వన్‌టౌన్, వన్‌టౌన్ నుంచి జమ్మిచెట్టు వరకు కూడా రోడ్ల విస్తరణ చేపట్టాలన్నారు. నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసుకున్న వీధి వ్యాపారులను గతంలో తొలగించారని, వ్యాపారులు వ్యాపారులు చేసుకునేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని అన్నారు. వచ్చే సమావేశంలో రోడ్ల విస్తరణ, వీధి వ్యాపారుల దుకాణానికి సంబంధించి నివేదికలను అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీసీపీ సంధ్య, ఏసీపీలు రంగస్వామి, శశికళ, టీపీఎస్‌లు శభరీష్, మంజుల పాల్గొన్నారు.