గత ప్రభుత్వంలో వై.ఎ్‌స.జగన్ ఫొటోతో జిల్లాలో పంపిణీ చేసిన భూహక్కు పత్రాల (పట్టాదారు పాసుపుస్తకాలు)ను వెనక్కి తీసుకోనున్నారు. నాటి సీఎం జగన్ ఫొటోలున్నవి తీసేసి.. రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం పేరుతో గత ప్రభుత్వం జిల్లాలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకాన్ని 2020 డిసెంబరు 22వ తేదీ నుంచి అమలు చేసింది. తొలిదశలో 132 గ్రామాల్లో 84,983.43 ఎకరాలు, రెండో దశలో 91 గ్రామాల్లో 2,33,207 ఎకరాలు, మూడో దశలో 106 గ్రామాలకు గాను 74 గ్రామాల్లో 65,553.81 ఎకరాల భూ రీసర్వే జరిగింది. 307 గ్రామాల్లో 3,83,744.93 ఎకరాల వ్యవసాయ భూముల రీసర్వే జరిపినట్లు జిల్లా యంత్రాంగం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 90,288 మంది రైతులకు భూహక్కు పత్రాలు (పాస్‌పుస్తకాలు) మంజూరు చేశారు. అప్పటి సీఎం జగన్ ఫొటో ఉన్న పాస్‌పుస్తకాలు స్వీకరించడానికి చాలా గ్రామాల్లో రైతులు వ్యతిరేకించారు. మరికొన్ని చోట్ల వాటిని తీసుకునేందుకు నిరాకరించడంతో ఉద్యోగులు వాటిని సచివాలయాల్లో నిల్వ ఉంచారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో భూహక్కు పత్రాల పంపిణీ ఆపేశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల కుప్పం పర్యటనలో ప్రకటించారు. దీంతో ఇంతవరకు జగన్ ఫొటోతో పంపిణీ చేసిన భూహక్కు పత్రాలను పూర్తిగా వెనక్కి తీసుకోనున్నారు.