దేశంలో ప్రత్యేక హోదా సాధించేందుకు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు.. పోరాటం చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో.. బీజేపీకి సొంతంగా బలం ఉండటంతో.. ఎన్నిసార్లు డిమాండ్లు చేసిన నరేంద్ర మోదీ సర్కార్ పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేంత బలం.. బీజేపీకి సొంతంగా లేదు. దీంతో ఎన్డీఏలోని మిత్ర పక్షాలపై ఆధారపడి నరేంద్ర మోదీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ.. బీహార్ నుంచి జనతా దళ్ యునైటెడ్ పార్టీలు కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారైనా ప్రత్యేక హోదా సాధించాలని అటు నారా చంద్రబాబు నాయుడు, ఇటు నితీష్ కుమార్ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే బీహార్‌లో అధికారంలో ఉన్న జనతా దళ్ యునైటెడ్ - జేడీయూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసింది. తాజాగా నిర్వహించిన జేడీయూ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో ఉన్న ఆర్థిక, అభివృద్ధి తేడాలను పేర్కొన్న జేడీయూ.. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే దీర్ఘకాల అవసరాన్ని స్పష్టం చేసింది.
బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ ఇప్పటిదేం కాదని.. ఎప్పటినుంచో కోరుతున్నట్లు సమావేశం తర్వాత జేడీయూ సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా బీహార్‌ను అభివృద్ధి మార్గంలో పరుగులు పెట్టించడం.. బీహార్‌కు ఉన్న ప్రత్యేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హోదా సాధించడం అనేది కీలకమైన అడుగు అని తెలిపారు. ఇక గతంలో బీహార్‌లో రిజర్వేషన్లను 65 శాతానికి నితీష్ కుమార్ పెంచగా.. ఇటీవల అది చెల్లదంటూ కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే.. 65 శాతం రిజర్వేషన్ కోటాను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్‌లో చేర్చి.. న్యాయపరమైన పరిశీలన నుంచి తప్పించాలని జేడీయూ భావిస్తోంది.
ఇక 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని విభజన తీర్మానంలో పొందుపరిచింది. అయినా ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇక అప్పటి నుంచి ప్రత్యేక హోదాపై అడపాదడపా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. మరోవైపు.. ప్రత్యేక హోదా సాధించడంలో విఫలం అయ్యారంటూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు.. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ అయిన టీడీపీ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తారా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కన్నా తక్కువ సీట్లు సాధించిన జేడీయూ.. ప్రత్యేక హోదాపై తీర్మానం చేయగా.. ఆ ఎఫెక్ట్ టీడీపీ మీద కూడా పడనుంది.