ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కడపలో ఘోర ఓటమి తర్వాత సైలెంట్ అయిన షర్మిల.. ఏపీ రాజకీయాలపై మళ్లీ స్పందించారు. అయితే ఈసారి పోలవరం ప్రాజెక్టు అంశం మీద వైఎస్ షర్మిల రియాక్టయ్యారు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పోలవరం, అమరావతి అంశాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు నాశనమైందంటూ.. చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయడం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. చంద్రబాబు ఆరోపణలు, వైసీపీ నేతల కౌంటర్లతో ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పోలవరం ట్రెండింగ్ టాపిక్‍గా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పోలవరం ప్రాజెక్టు గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
"కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపి, వైసీపీ పార్టీలే. ప్రాజెక్ట్ కట్టి 28లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయమయితే.. పంతాలు పట్టింపులకు పోయి జీవనాడిపై ఇన్నాళ్లు జరిగింది.. రాజకీయ దాడి తప్ప మరోటి కాదు. విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే.. మోదీ సర్కార్ ఆ బాధ్యత విస్మరించి పదేళ్లు నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపింది. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్‌ను తానే కడతానని చెప్పి పోలవరం, సోమవారం అంటూ హడావిడి తప్ప చంద్రబాబు మొదటి 5 ఏళ్లలో చేసింది శూన్యం". అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
అలాగే "రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ అంచనా వ్యయం పెంచాడే తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.10 వేల కోట్లతో కాంగ్రెస్ హయాంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు నిర్లక్ష్యం ఖరీదు అక్షరాల 76 వేల కోట్లు. ప్రాజెక్ట్ కట్టాలంటే మరో 5 ఏళ్లు పడుతుందని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.. మోదీ పిలక మీ చేతుల్లోనే ఉంది. కేంద్రాన్ని శాసించే అధికారం మీ దగ్గరుంది కావున.పూర్తి స్థాయి నిధులు తెచ్చి,రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా, పోలవరం పూర్తి చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించనుంది. ఆదివారం నుంచి 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును పరిశీలించనుంది. కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనుంది. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా లేదా కొత్తది కట్టాలా అనే దానిపై సూచనలు చేయనుంది. అలాగే కాఫర్ డ్యామ్‌లు, గైడ్‌బండ్‌ల పరిస్థితిపైనా అంతర్జాతీయ నిపుణుల బృందం సూచనలు చేయనుంది.