ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకుపడింది. అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం స్థలాన్ని నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1,575 ఎకరాలను సీఆర్‌డీఏ నోటిఫై చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ బహిరంగ ప్రకటన జారీ చేశారు. ఈ భూముల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్‌ను నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో పనులు జోరందుకున్నాయి. ఎన్నికలు ముందు కూడా అమరావతే రాజధాని అని స్పష్టం చేసిన చంద్రబాబు.. ముఖ్యమంత్రిగానూ అదే మాటను ఉద్ఘాటించారు. సీఎం హోదాలో పోలవరంలో పర్యటించిన చంద్రబాబు.. ఆ తర్వాత రాజధాని అమరావతిలోనూ పర్యటించారు. శంకుస్థాపన చేసిన ప్రాంతం దగ్గర నుంచి.. అధికారుల క్వార్టర్స్ వరకూ అన్నిచోట్లను పరిశీలించారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్పిన సీఎం చంద్రబాబు.. అమరావతి రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే గతంలో అమరావతిలో స్థలాలు కేటాయించిన వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను సంప్రదిస్తున్నారు. 2014-19 కాలంలో అమరావతిలో ఏపీ ప్రభుత్వం పలు సంస్థలకు స్థలాలు కేటాయించింది. అయితే వైసీపీ పాలనలో అమరావతి రాజధాని అంశాన్ని పక్కనపెట్టడంతో ఈ స్థలాల్లో ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. అయితే తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో తిరిగి కార్యాలయాలు ఏర్పాటు చేయటంపై ప్రభుత్వ సంస్థల ఆసక్తిని తెలుసుకుంటోంది. ఇదే క్రమంలోనే ఇప్పుడు ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం 1500లకు పైగా ఎకరాలను నోటిఫై చేశారు.