ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ ఛైర్మన్‌గా చంద్రబాబు సన్నిహితుడికి పదవి.. సీనియర్‌కే అవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 07:43 PM

ఆంధ్రప్రదేశ్‌ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు పాలనలో బిజీ అయ్యారు. శాఖలవారీగా సమీక్షలు చేసుకుంటూ.. అవసరమైన మార్పులు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని స్వయంగా చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామని.. ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీటీడీ ఛైర్మన్ పదవిపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారి టీడీపీ సీనియర్ నేత, చంద్రబాబు స్నేహితుడిగా పేరున్న నేతకు ఇస్తారని చర్చ మొదలైంది.


టీటీడీ ఛైర్మన్ పదవిపై దాదాపుగా క్లారిటీ వచ్చేసిందని.. పార్టీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజుకు ఖాయమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అశోక్ అయితే ఆ పదవికి హుందాతనం పెరుగుతుందని.. అలాగే ఆయన పలు ఆలయాలకు ధర్మకర్తగా కూడా ఉన్నారు. ఆ అనుభవం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారట.. అందుకే ఆయనవైపు మొగ్గుచూపారని చెబుతున్నారు. ఆయన పేరు దాదాపుగా ఖరారైందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతేకాదు అశోక్‌ గజపతిరాజు పేరు తెరపైకి రాగానే తెలుగు తమ్ముళ్ల కూడా ఆయనైతేనే బావుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


అశోక్‌గజపతిరాజు కుటుంబం మొదటి నుంచి తెలుగు దేశం పార్టీలో కొనసాగుతోంది. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.. 2014 ఎన్నికల్లో విజయనగరం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆయన అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో మరోసారి విజయగనరం ఎంపీగా పోటీచేయగా.. ఆయన కుమార్తె అదితి విజయలక్ష్మి విజయనగరం ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో అదితి విజయలక్ష్మికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్ దక్కింది.. అశోక్‌గజపతిరాజు పోటీ చేయలేదు. అదితి విజయలక్ష్మి ఎన్నికల్లో విజయనగరం నుంచి గత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై ఏకంగా 60,609 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


2024 ఎన్నికల తర్వాత అశోక్‌ గజపతిరాజును గవర్నర్‌గా నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి టీడీపీకి రెండు గవర్నర్‌ పదవులు ఆఫర్ చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఎలాంటి క్లారిటీ రాలేదు.. ఇప్పుడు టీటీడీ ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును నియమించబోతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు అశోక్ ‌గజపతిరాజు వైపు మొగ్గు చూపుతారా.. ఇంకెవరికైనా అవకావం ఇస్తారా అన్నది చూడాలి.


అంతేకాదు టీటీడీ ఛైర్మన్ పదవిపై ఏపీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో మరో ప్రచారం జరిగింది. ఈ పదవిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నాగబాబు స్వయంగా స్పందించారు. ‘దయచేసి అసత్య వార్తలను ఎవరూ నమ్మకండి. పార్టీ అధికారిక, నా సోషల్‌మీడియా ఖాతాల ద్వారా పోస్ట్‌ అయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. దయచేసి ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయకండి’ అని ట్వీట్ చేశారు. జనసేన పార్టీకి సేవ చేయడం తప్ప.. తనకు పదవులపై ఆలోచన లేదన్నారు నాగబాబు. జనసేనను ఇంకా ఉన్నతస్థానాలకు ఎలా తీసుకెళ్లాలా? అనే ఆలోచనలో ఉన్నానన్నారు. అన్న అలాగే క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెడతామన్నారు నాగబాబు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com