ఉమ్మడి విశాఖపట్నం జిల్లావాసులకు అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. శనివారం నుంచి అగనంపూడి టోల్ గేట్ రుసుమును ఆర్టీసీ బస్ ఛార్జీల్లో టికెట్ నుంచి తొలగిస్తున్నట్లు.. ఇకపై ప్రయాణికులకు ఆ భారం ఉండదన్నారు. అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారి పద్మావతి తెలిపారు. ఈ మేరకు తమకు ఆదేశాలు అందాయని.. అందుకే ఈ ఛార్జీలను తొలగిస్తున్నట్లు చెప్పారు. కొన్ని సిటీ బస్సుల్లో అప్పటికప్పుడు తొలగింపు చర్యలు తీసుకున్నామన్నారు. శనివారం నుంచి ఆన్‌లైన్లలో పూర్తి స్థాయిలో తొలగింపు ప్రక్రియ అమల్లోకి వస్తుంది అన్నారు.
అగనంపూడి టోల్ గేటు ఛార్జీగా పలు కేటగిరీల బస్సు టికెట్ల నుంచి ఇప్పటివరకూ.. రూ. 5 నుంచి రూ. 10 వరకూ వసూలు చేశామని గుర్తు చేశారు. ఇక నుంచి ఈ ఛార్జీలు అన్నిటికి మినహాయించామని తెలిపారు. అలాగే ఆర్టీసీ బస్సు పాసుల ధరల్లో టోల్ ఛార్జీ వసూలు చేయరని.. అయితే వీటి ధరల్లో ఎటువంటి తగ్గింపులు ఉండవన్నారు. ఈ టోల్‌గేట్ దగ్గర ఒక్కో బస్సుకు రూ. 215 చెల్లించేవారమని గుర్తు చేశారు. ఈ రుసుము ఇక చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.. ప్రయాణికుల నుంచి వసూలు చేయడం లేదన్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణికుల నుంచి టోల్‌గేటు రుసుములను పూర్తిగా మినహాయించడంపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లాలో, విశాఖపట్నంకు శివారులో అగనంపూడి టోల్‌గేటు ఉంది. ఈ టోల్ గేట్ జీవీఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి. కేంద్రం నేషనల్ హైవేల విస్తరణ చేపట్టగా అనకాపల్లి నుంచి లంకెలపాలెం, అగనంపూడి ప్రాంతాలను కలుపుతూ గాజువాక మీదుగా విశాఖకు వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హైవేకు సంబంధించిన ఖర్చు ప్రజల నుంచి వసూలు చేసేందుకు టోల్‌గేటు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అయితే ఆ సమయంలో అనకాపల్లి, గాజువాక ప్రాంతాలు పురపాలక సంఘాలుగా ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో టోలు వసూలు చేయకూడదు. దీంతో రెండింటికీ మధ్యలో పంచాయతీగా కొనసాగుతున్న అగనంపూడిలో టోల్‌గేటు ఏర్పాటు చేశారు.
ఈ హైవేపై మొత్తం ఖర్చు వసూలైనా ఈ టోల్‌గేట్‌ను కొనసాగించడంపై విమర్శలు వచ్చాయి. ఆర్టీసీకి కూడా మినహాయింపు లేకుండా అందరిపై భారం మోపారు. అయితే 2019 ఎన్నికలకు ముందు గాజువాక బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టును ఆశ్రయించారు.. ఈ అగనంపూడి టోల్‌గేటు మూసేయించారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ టోల్‌గేట్ తెరిచి వసూళ్లు మొదలుపెట్టారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ నుంచి గాజువాకలో పోటీచేసిన పల్లా శ్రీనివాసరావు.. కూటమి అధికారంలోకి వస్తే ఈ టోల్‌గేట్ తొలగించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు విజయం సాధించడంతో.. ఇచ్చిన హామీ ప్రకారం కూటమి నేతలు, కార్యకర్తల సహకారంతో ఇటీవల టోల్ రుసుము వసూళ్లను అడ్డుకున్నారు. ఇకపై అగనంపూడి టోల్‌గేట్ వద్ద ఎలాంటి రుసులు వసూలు చేయబోరని ఎమ్మెల్యే ప్రకటించారు. ఆయన ఎన్ హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి గురువారం ఉదయం టోల్‌గేట్‌ని పూర్తిగా తొలగించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.