విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామివార్ల దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. ప్రతి రోజూ కొంతసేపు అమ్మవారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.15 మధ్య.. ఆలయంలో అమ్మవారికి మహా నైవేద్య సమయం ఉంటుంది. ఈ కారణంతోనే అమ్మవారి దర్శనాలు నిలిపివేస్తున్నామని చెప్పారు. ఇంద్రకీలాద్రి దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఈవో గుర్తు చేశారు. ప్రతి వారం శుక్ర, శని, ఆదివారాలతో పాటు ఇతర రోజుల్లో భక్తుల రద్దీ పెరుగుతోందన్నారు.
కాబట్టి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేందుకు.. వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులు, అన్ని శాఖల అధికారులు ఉదయం 11.30 మధ్యాహ్నం 1.30 గంటల లోపు దర్శనాలకు రావొద్దన్నారు. ఆ సమయంలో కాకుండా మిగిలిన సమయాలలో దర్శనానికి రావాలని కోరారు. వీకెండ్ (శుక్ర, శని, ఆదివారాలు)లో ఇతర ప్రత్యేక రోజులలో రద్దీ వీపరితంగా ఉండటంతో కొండపైకి వాహనాల రాకపోకలను రద్దు చేసినట్లు ఈవో తెలిపారు.
కొండపైకి వాహనాలకు అనుమతి లేదు కాబట్టి.. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పున్నమి ఘాట్, సీతమ్మవారి పాదాల వద్ద పార్కింగ్‌లో వాహనాలను నిలుపుకోవాలన్నారు. అక్కడి నుంచి దేవస్థానం బస్సులలో కొండపైకి చేరుకోవాలని సూచించారు. ఈ మార్పుల్ని గమనించి భక్తులు సహకరించాలని కోరారు. దుర్గగుడిలోని ధర్మపథం వేదికపై స్వేచ్ఛ నృత్య తరంగిణి గోవర్దనరావు ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యప్రదర్శన జరిగింది. కళాకారులు పలు కీర్తనలకు తమ అభినయంతో ఆకట్టుకున్నారు.
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మ సేవలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ పాల్గొన్నారు.ఆయనకు ఈవో కేఎస్ రామారావు, అధికారులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు.. అమ్మవారి దర్శనం తర్వాత వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఈవో రామారావు ఆయనకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.