తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పదేళ్లు దాటింది. మెున్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా.. ఇక నుంచి నగరం తెలంగాణకు మాత్రమే రాజధాని. కాగా.. ఏపీ-తెలంగాణ మధ్య ఇప్పటికీ కొన్ని విభజన సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే వివాదం కొనసాగుతుంది. తెలంగాణ నుంచి ఏపీకి భారీగా నిధులు రావాల్సి ఉందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం ఆ రాష్ట్రం నుంచి ఏపీకి సుమారు రూ.5,170 కోట్లు రావాల్సి ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుప్రీం, హైకోర్టుల్లో కేసులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఆ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రూ.వేల కోట్ల ఆస్తులున్న సంస్థల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉందన్నారు. ముఖ్యంగా 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విషయంలో విభజన సమస్యలు కొలిక్కిరావడం లేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు. కానీ విభజన అనంతరం ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.