ఏపీలో విమాన ప్రయాణాలు సాగించేవారికి విజయవాడ ఎయిర్‌పోర్టు అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. ఎయిర్ పోర్టులో కార్గో సేవలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు విమానాశ్రయ డైరక్టర్ లక్ష్మీకాంత రెడ్డి వెల్లడించారు. జులై 1ను ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. 2021లోనే విజయవాడ ఎయిర్‌పోర్టులో కార్గో సేవలు ప్రారంభించారు. అయితే కరోనా కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి.
ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగడంతో తిరిగి కార్గో సేవలను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జులై 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒమేగా ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ ఈ సేవల టెండర్‌ను దక్కించుకుంది. ఏపీ నుంచి ఆక్వా ఉత్పత్తులైన చేప, రొయ్యలతోపాటు మిర్చి, పూలు, పండ్లు వంటి ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతానికైనా తరలించవచ్చు. తక్కువ ధరలలో గంటల వ్యవధిలో వాటిని గమ్యస్థానాలకు చేర్చేందుకు కార్గో సర్వీసు ఉపయోగపడనుంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ కార్గో సర్వీసు నడిపేందుకు కస్టమ్స్ అధికారులతో చర్చిస్తున్నట్లు లక్ష్మీకాంతరెడ్డి వెల్లడించారు.