ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధం అయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పెన్షన్లను జులై 1 వ తేదీన.. లబ్దిదారులకు అందించనున్నారు. ఈ క్రమంలోనే స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందించనున్నారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెన్షన్లను.. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారుల చేతుల్లో పెట్టాలని సీఎస్ ఆదేశించారు. అందుకు ముందుగానే డబ్బులు బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకుని ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటుగా.. గత 3 నెలల బకాయిలు మూడు వేలు కలిపి జులై 1 వ తేదీన లబ్ధిదారులకు రూ.7 వేలు అందనుంది.
జులై 1 వ తేదీనే 90 శాతం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మొత్తం 65,18,496 మంది పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4,399.89 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. ఇక 1 వ తేదీ రోజు పెన్షన్లు అందని వారికి తర్వాత రోజు కచ్చితంగా అందజేయాలని స్పష్టం చేశారు. ఇక పెన్షన్ల పథకానికి సంబంధించిన పేరును ‘ఎన్టీఆర్ భరోసా’ గా పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇలా సీఎం ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే పెన్షన్లను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక దివ్యాంగులకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచుతామని చెప్పింది. అధికారంలోకి రాగానే పెన్షన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నుంచే ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. దీంతో జూలై 1 వ తేదీన వృద్ధులు, వితంతవులకు రూ. 4 వేల పెన్షన్లతోపాటు అదనంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు గానూ వెయ్యి రూపాయల చొప్పన మొత్తం రూ. 7 వేలు లభించనుంది.