ఎన్నో నెలల నుంచి ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం అయింది. శనివారం రోజే ప్రారంభం అయిన అమర్‌నాథ్ యాత్రకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. అమర్‌నాథ్ గుహలో ఉన్న మంచు శివలింగాన్ని తొలిరోజున 13 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఇక ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా ఉగ్రవాద దాడులు, ఉగ్రవాదుల సంచారం నేపథ్యంలో అధికారులు, భద్రతా బలగాలు.. అమర్‌నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు మధ్య జమ్మూ కాశ్మీర్‌లోని జంట బేస్ క్యాంపులైన బాల్టాల్, నున్వాన్‌ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరి.. అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.
కాశ్మీర్‌లోని బేస్ క్యాంపుల నుంచి బయల్దేరిన మొదటి బ్యాచ్ యాత్రికులు నడక మార్గంలో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహను చేరుకున్నారు. మరోవైపు జమ్మూలోని భగవతినగర్ బేస్ క్యాంపు నుంచి 1881 మంది యాత్రికులతో కూడిన రెండవ బ్యాచ్.. కాశ్మీర్ బేస్ క్యాంపులకు జంట శనివారం బయలుదేరి చేరింది. వీరిలో 427 మంది మహిళలు.. 294 మంది సాధువులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఇక అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బాబా బర్ఫానీ (మంచు శివలింగం)ను దర్శించుకున్న భక్తులందరికీ శివుడు అపారమైన శక్తిని అందిస్తారని చెప్పారు. భక్తుల ప్రయాణం సురక్షితంగా, ఆహ్లాదకరంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కాశ్మీర్‌లోని జంట బేస్ క్యాంపుల వద్ద 100 పడకల ఆస్పత్రులను రెండింటిని నెలకొల్పినట్లు ఓఎన్‌జీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి తాత్కాలిక ఆస్పత్రులు కాదని శాశ్వతంగా నిర్మించినట్లు వెల్లడించింది. అమర్‌నాథ్ యాత్ర తర్వాత కూడా కాశ్మీర్ ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొంది.