ప్రస్తుతం మన దేశంలో మరికొన్ని రోజుల్లో జరగనున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆసియాలోనే అత్యంత కుబేరుల్లో ముందు వరుసలో ఉండే ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుంది. అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రిక ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బంగారు, వెండితో తయారు చేసిన అత్యంత ఖరీదైన ఆ పెళ్లి పత్రికను చూసి ఎంతోమంది షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు అంతకంటే షాక్ అయ్యే పెళ్లి ఒకటి జరిగింది. ఈ పెళ్లికి హాజరైన అతిథులకు ఒక్కొక్కరికీ రూ.66 వేలను బహుమతులుగా అందించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చైనాకు చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ డానా చాంగ్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఎందుకంటే మోస్ట్ లగ్జరీ వెడ్డింగ్‌కు సంబంధించిన వీడియోను డానా చాంగ్ పోస్ట్ చేశారు. అందులోని దృశ్యాలు చూస్తే అవాక్కయి.. నోరెళ్లబెట్టడం ఖాయం. ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు వారి జీవితంలో మర్చిపోలేని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని.. నిర్వాహకులు అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లికి వచ్చేవారిని విమానాల్లోకి తీసుకొచ్చి.. తిరిగి విమానాల్లోనే ఇళ్లకు సాగనంపారు. 5 రోజుల పాటు అత్యంత లగ్జరీ ఫైవ్ స్టార్ హోటళ్లలో అతిథులకు రూమ్‌ల బుక్ చేశారు.
ఇక ఆ హోటళ్ల నుంచి పెళ్లి మండపడానికి వెళ్లడానికి అతిథులను రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి ఖరీదైన కార్లలో తరలించారు. పెళ్లి మండపంలో చేసిన డెకరేషన్ చూస్తే అది స్వర్గాన్ని తలదన్నేలా ఉంది. ఇక కొత్త పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఫొటోలతో ఏకంగా న్యూస్ పేపర్లు కూడా సిద్ధం చేశారు. అంతేకాదు పెళ్లికి వచ్చిన అతిథులు ఒక్కొక్కరికి రెడ్ కలర్ కవర్‌లో 800 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.66 వేలను పెట్టి రిటర్న్ గిఫ్ట్‌గా అందించారు. చైనాలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక ఈ రిచ్ వెడ్డింగ్ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురుస్తోంది. అతిథులకే ఏకంగా రూ.66 వేల రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారంటే వాళ్లు ఎంత ధనవంతులు అయి ఉంటారు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చిన అతిథులను ఇంతలా గౌరవించడం నచ్చిందని.. వారి ప్రయాణ ఖర్చులు కూడా పెళ్లి వారే భరించడం బాగుందని నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.