ఆంధ్రప్రదేశ్‌లో ఓ మంత్రి సతీమణి.. ఎస్సైకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు (జూలై 1) పింఛన్ల పంపిణీ (ఎన్టీఆర్ భరోసా) మొదలైన సంగతి తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పింఛన్లను పంపిణీ చేశారు. ఇదే క్రమంలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితా రెడ్డి పింఛన్లను పంపిణీ చేసేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో ఆలస్యంగా ఎందుకు వచ్చావంటూ.. ఎస్సై రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెల్లారిందా..? మీ కోసం మేం ఎదురుచూడాలా..? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. మీకు జీతాలు ప్రభుత్వమే ఇస్తోంది కదా..? వైఎస్సార్‌సీపీ ఏం ఇవ్వట్లేదు కదా..?’ అని ఆ పోలీస్ అధికారిని మంత్రి సతీమణి హరితారెడ్డి నిలదీశారు. ‘కాన్ఫరెన్స్ ఉంది మేడం’ అంటూ ఆ ఎస్సై బదులివ్వగా.. ‘సీఐకి లేని కాన్ఫరెన్స్ మీకు ఉందా?’ అని ప్రశ్నించారు. కాన్వాయ్ స్టార్ట్ చేయండి అంటూ ఆదేశిస్తూ అక్కడ నుంచి బయల్దేరారు.