ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాల్లో లబ్ధిదారులు చేపట్టిన ఇంటి నిర్మాణాలను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి జేసీబీతో రెండు ఇళ్ల పిల్లర్లు, ఫౌండేషన్ నిర్మాణాలను పెకిలించి వేశారు. ఈ ఘటన స్థానికంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలవరం గ్రామంలోని మంకొల్లు రోడ్డులో నాలుగో లే అవుట్‌లో 28 మంది పేదలకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇంటిస్థలాలు మంజూరు చేసింది. వాటికి రిజి్రస్టేషన్ చేయించి పట్టాలు ఇచ్చింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు దానం బాబూరావు, కొంగర దేవదత్తం తమకు ఇచ్చిన స్థలాల్లో రూ.2 లక్షల వంతున వెచ్చించి ఇంటి నిర్మాణాల కోసం పునాదులు నిర్మించి, పిల్లర్లు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల అదే గ్రామంలో జగనన్న లే అవుట్‌లో వేల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రావెల్ రోడ్లను ధ్వంసం చేశారు. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సొంత నియోజకవర్గంలో ఇలాంటి విధ్వంసాలు చేపట్టడం దారుణమని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి పిల్లర్లు, ఫౌండేషన్ నిర్మాణాలను పెకలించి వేయడంపై బాధితులు ఫిర్యాదు చేశారని, విచారించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తహసీల్దార్ మహ్మద్ మసూద్ అలీ తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లోను ఫిర్యాదు చేసినట్టు లబ్ధిదారులు చెప్పారు.