వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు సామాజిక పెన్షన్లు ఇళ్ల వద్ద పంపిణీ చేయకుండా జగన్ చేసిన కుట్ర నేడు కళ్ళకు కట్టినట్లు రుజువైందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సచివాలయ ఉద్యోగులు నేరుగా ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసే వ్యవస్థ మనకు ఉందని, నిన్న రాష్ట్రంలో 95 శాతం పంపిణీ జరిగిన తీరును చూస్తే తెలుస్తోందన్నారు. ఎన్నికల సమయంలో 34 మంది పెన్షనదార్ల మరణాలు ముమ్మాటికి జగన్ హత్యలని రుజువయ్యాయన్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ చేయవచ్చని నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన జగన్ పట్టించుకోలేదని అన్నారు. పెంచిన పెన్షన్లను విడతలవారీగా కాకుండా ఒకేసారి హామీ ఇచ్చిన రోజు నుంచే అమలు చేయడంతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం, ఇళ్లల్లో పండుగ వాతావరణం కనిపించిందన్నారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చిన జగన్ పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.