దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతాను. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను. కాలుష్యం లేని భారీ పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తా. విదేశాలకు వెళ్లే యువతకు అవసరమరైన శిక్షణ ఇప్పిస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలోని సత్యకృష్ణ కల్యాణ మండపంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ మొత్తాలను అందజేశారు. కాకినాడ జిల్లాలో 2,79,319మంది లబ్ధిదారులకు రూ.118.40కోట్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. కొత్తపల్లి మండలంలోని సముద్రపు తీరప్రాంతాల్లో తాగునీటి కోసం అక్కడ మహిళలు పడుతున్న కష్టాలను తాను స్వయంగా చూశానని తెలిపారు. ప్రజలందరికీ రక్షిత మంచినీరు ఇవ్వాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, అర్హులకు పింఛన్లు ఇవ్వాలి, కాలువల్లో పూడికలు తీయించాలి, పారిశుధ్య పరిస్థితులు సక్రమంగా లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని రాష్ట్రం అంతా అమలు చేసే ముందు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడ నూరుశాతం శానిటేషన్ చేయడంతోపాటు ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడం చేద్దామని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను, పోలీసులను, అధికారులను ఇబ్బందులు పెట్టి విజయయాత్ర చేయాలనుకోలేదని, పనిచేసిన తర్వాతే తనకు విజయయాత్ర అని స్పష్టం చేశారు. పనిచేసి మన్ననలు పొందితేనే తనకు ఆనందం. అప్పుడే నేను ఎమ్మెల్యేను అయ్యాను అన్న ఆనందం కలుగుతుందని పవన్‌కల్యాణ్ తెలిపారు. ఎక్స్‌పర్ట్‌లను తీసుకువచ్చి పిఠాపురానికి మేలు చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పారు.