పోలవరం పరివాహక మెట్ల గ్రామాల్లో పంటలను కాపాడేందుకు పోలవరం కాల్వపై మోటార్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన ఇరిగేషన్ ఎస్‌ఈకి వినతిపత్రం అందజేశారు. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లోని మెట్ట భూములకు గతంలో నాగార్జున సాగర్ కాలువ ద్వారా సాగునీరు అందేదన్నారు. సాగర్ కాలువకు పోలవరం కాలువ అడ్డుగా రావడంతో సాగర్ నీరు గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట భూములకు, 12,570 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదన్నారు. రైతుల సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు పోలవరం కాలువపై మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందించాల్సి ఉం దన్నారు. ఇందుకోసం బాపులపాడు మండలంలో 57 మోటార్లు, గన్నవరం మండలంలో 63 మోటార్లు, విజయవాడ రూరల్ మండలంలో ఏడు మోటార్లు ఏర్పాటు చేసి రైతు లకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. నాలుగు చోట్ల రెగ్యులేటర్ నిర్మాణం జరిగిందని, వాటికి అనుసంధానంగా కాల్వల తవ్వకం పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ పనులకు అంచనాలు రూపొందించగా రూ 1.10కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి ఖరీఫ్ పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.