ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల రక్షణకు ఇంటర్నల్ కమిటీలను ఏర్పాటుచేయాలని విశాఖ జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీ (డిస్ర్టిక్ట్ లోకల్ కంప్లయింట్స్ కమిటీ) చైర్‌పర్సన్ డాక్టర్ పి.ఉష ఆదేశించారు. అధికారులు కమిటీని ఏర్పాటు చేయకపోతే రూ.50 వేల జరిమానా విధిస్తామన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు, లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి 2013లో చట్టం వచ్చిందన్నారు. ఈ చట్టం ప్రకారం పది మందికి మించి సిబ్బంది ఉన్న కార్యాలయాల్లో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీలో ఒక మహిళా ఉద్యోగిని నియమించాలన్నారు. మహిళా ఉద్యోగులు పనిచేసే చోట వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినా, లైంగిక చర్యలకు పాల్పడినా అటువంటి అధికారులు, యజమానులు శిక్షార్హులవుతారన్నారు. మహిళా ఉద్యోగుల ఫిర్యాదులను స్వీకరించేందుకు జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీ ఉందని, దానికి చైర్‌పర్సన్‌గా తాను, కార్యదర్శిగా జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి డాక్టర్ జయదేవి ఉన్నట్టు వెల్లడించారు. ప్రతినెలా కార్యాలయాలు నివేదిక సమర్పించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.