కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఉదయం తాళ్ళపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని మంత్రి విడుదల చేశారు. నీటి విడుదలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు లభ్యం కానుంది. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ... పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందనే కారణంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు చేపట్టారని.. ఈ పట్టిసీమ పథకం బంగారు పథకంగా మారిందని చెప్పుకొచ్చారు. ప్రతీ ఏడాది 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామన్నారు. గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా 35 టీయంసీల నీరు నిల్వ ఉంచే అవకాశం ఉండేదని.. అయితే ఇప్పుడు కేవలం అర టీయంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని.. అందుకు జగన్ వైఖరి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేశామన్నారు. రాబోయే మూడు రోజుల్లో నీటి విడుదల సామర్ధ్యాన్ని 8500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామన్నారు.
![]() |
![]() |