రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని కోసం 53, 748 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. 8278 ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. 'అమరావతి రైతులు ఎన్నో అవమానాలకు గురయ్యారు. కొద్దిరోజుల తర్వాత రోడ్డుమీదకు వచ్చారు. ఆ రైతులు తిరుపతి వెళితే కళ్యాణ మండపం ఇవ్వలేదు. శ్రీకాకుళం వెళితే మధ్యలో అడ్డగించి పంపారు. అమరావతి నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ల్యాండ్ అక్వైజేషన్ నోటిఫికేషన్ రద్దు చేశారు. దాంతో 122 మందికి నమ్మకం పోయింది. వర్క్ స్టార్ట్ చేయలేదు. 14 ఎకరాల్లో 12 టవర్లలో నిర్మిస్తోన్న హ్యాపీ నెస్ట్‌లో 1420 ఫ్లాట్లు బుక్ అయ్యాయి. ప్రాజెక్టు కాస్ట్ పెరిగి రూ.160 కోట్ల నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది. పూర్తి కాని బిల్డింగులు చాలా ఉన్నాయి అని’ సీఎం చంద్రబాబు వివరించారు.