‘ప్రభుత్వాలు మారుతున్నాయి.. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితుల సమస్యలు మాత్రం తీరడం లేదు’ అని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నిర్వాసితుల సమస్యలపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కుక్కునూరు మండలంలోని మర్రిపాడు, కివ్వాక పునరావాస కాలనీలను రాష్ట్ర రైతు సంఘం, కౌలు రైతు సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో సందర్శించి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా మండలం మొత్తాన్ని యూనిట్‌గా తీసుకుని నిర్వాసితులకు భూపరిహారం, పునరావాస పరిహారం అందించాలన్నారు. 2022 గోదావరి వరదలు సంబవించినప్పుడు ప్రభుత్వ అంచనా మొత్తం తప్పిందన్నారు. ప్రభుత్వాలు సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం లేదన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన యువతి, యువకులను పునరావాస జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం రూ.10లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి కనీసం నిర్వాసితుల ముఖం చూడలేదన్నారు. గతంలో ఇచ్చిన భూములకు మూడున్నర లక్షలు రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నిర్వాసితుల సమస్యలపై ఈనెల పదో తేదీన కేంద్ర మంత్రులను ఢిల్లీలో కలిసి సమస్యలు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రవి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాణి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, నరసింహారావు, నాగేంద్రరావు, సాయికిరణ్, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.