గత కొన్ని రోజులుగా తరచూ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరగడం సర్వ సాధారణం అయిపోయింది. సరిహద్దుల నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను.. భద్రతా బలగాలు మట్టుబెడుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో అలజడులు సృష్టించేందుకు నిత్యం ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలను ఎక్కడికక్కడ సైన్యం, పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. భద్రతా బలగాలు చూపిస్తున్న తెగువ అక్కడి ప్రజల్లో కొంత ధైర్యం నింపుతోంది. తాజాగా కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వారు ఉగ్రదాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు.
కుల్గాం జిల్లాలోని మోడెర్గాం గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందిన భద్రతా బలగాలు, కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను ఏరివేసేందుకు వెళ్లగా.. ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలపైకి ఆ ఇంట్లో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ మోడెర్గాం గ్రామాన్ని భారీగా భద్రతా బలగాలు చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి.
ఇక కుల్గామ్ జిల్లాలోని ఫ్రిసల్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఈ ఘటనలో ఓ సైనికుడు అమరుడు కాగా.. మరో జవాన్‌కు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల మృతదేహాలకు సంబంధించిన దృశ్యాలు డ్రోన్ ఫుటేజీలో రికార్డ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక ఘటనాస్థలిలో మరో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం జల్లెడ పడుతున్నారు.
మరోవైపు.. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా ఉగ్ర ఘటనలు, ఎన్‌కౌంటర్లు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు.. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుండటం.. మరోవైపు.. ఉగ్రదాడులు పెరిగిపోతుండటంతో యాత్రికుల్లో తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అమర్‌నాథ్ యాత్ర పూర్తి కాగానే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరపాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడులు పెరిగిపోతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.