ఆంధ్రప్రదేశ్‌లో జులై 8 వ తేదీ (సోమవారం) నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. ముందుగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందించనున్నారు. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించింది. అయితే ప్రజల నుంచి కేవలం ఇసుక తవ్వకాల ఖర్చు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చిన నేపథ్యంలో అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా జరగకుండా అధికారులతో పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేయనున్నారు. అయితే దగ్గర్లో ఉన్న వాగులు, వంకల నుంచి స్థానికులు ఎడ్ల బండ్లలో ఇసుకను తెచ్చుకునేందుకు అవకాశం కల్పించారు.
ఈ మేరకు ఉచిత ఇసుక విధానంకు సంబంధించి సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం.. అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు వివరించారు. ఇప్పటివరకు ఉన్న కాంట్రాక్టర్లు.. జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా పక్కకు తప్పుకున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ క్రమంలోనే ఇసుక నిల్వలను స్థానిక కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు గనులశాఖ అధికారులు లెక్కించారు. సోమవారం నుంచి ఈ నిల్వలను ప్రజలకు అందించనున్నారు. రాబోయే 3 నెలలకు 88 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉంటుందని గుర్తించారు. సంవత్సరానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు.
ఆయా జిల్లాల్లోని ఇసుక రీచ్‌లలో ఎంత ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు సోమవారం నుంచి ప్రకటించనున్నారు. ఆ ఇసుకను ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ఏర్పాటు చేసి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక నదుల్లో ఇసుక అక్రమంగా తవ్వకుండా.. నిల్వ కేంద్రాల నుంచి తీసుకుంది అక్రమంగా విక్రయాలు జరపకుండా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లు నిఘా ఉంచనున్నాయి. రీచ్‌ల నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీచేయనున్నారు.
అయితే సీనరేజ్ కింద టన్నుకు రూ.88 తీసుకోనున్నారు. ఇప్పటివరకు గుత్తేదారులు తవ్విన ఖర్చుల కింద టన్నుకు రూ.30 చొప్పున వసూలు చేయనున్నారు. ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక టన్నుకు రూ.225 చొప్పున తీసుకోనున్నారు. ఇక రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే.. రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. నిర్వహణ ఖర్చుకింద టన్నుకు రూ.20 తీసుకోనున్నారు. వీటన్నింటికీ కలిపి 18 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఇవన్నీ కలిపి.. టన్ను ఇసుక ఎంత అనేది కలెక్టర్లు నిర్ధారణ చేస్తారని చెప్పారు.
సీనరేజ్ కింద వసూలు చేసే రూ.88ను.. ప్రతినెలా జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమచేయనున్నారు. ఇక నిర్వహణ ఖర్చు కింద టన్నుకు రూ.20 తీసుకున్న సొమ్మును.. వేబిల్లుల కొనుగోలు, సెక్యూరిటీ, రీచ్‌ల పర్యావరణ అనుమతుల ఫీజులు చెల్లించేందుకు ఉపయోగించనున్నారు. ఇక ఇసుక ధర తెలిసేలా రీచ్‌లలో బ్యానర్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా గనులశాఖ అధికారి పేరు మీద జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇసుకకు చెల్లించిన డబ్బును జమచేస్తారు.
ఇక దగ్గర్లో ఉన్న వాగులు, వంకల్లో ఉన్న ఇసుకను డైరెక్ట్‌గా స్థానికులు తీసుకెళ్లేలా అవకాశం కల్పించారు. ఎడ్ల బండ్ల ద్వారా మాత్రమే తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. మరోవైపు.. బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వితీసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి వాటికి పర్యావరణ అనుమతులు అవసరం లేకపోయినా.. కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏయే రీచ్‌ల్లో ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉంటాయనేది అంచనాలు రూపొందించి.. సెప్టెంబరు చివరి నాటికి అనుమతులు తీసుకుంటారు.