బీజేపీ కురువృద్ధుడు, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ప్రస్తుతం అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలి కాలంలో ఆయన రెండు సార్లు ఆస్పత్రిలో చేరి మళ్లీ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా ఆయన అనారోగ్య కారణాలు, వయసు ప్రభావం కారణంగా రాలేకపోయారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇటీవల ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మోదీనే స్వయంగా ఎల్‌కే అద్వానీ ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వీ సోమన్న చేసిన పని తీవ్ర దుమారానికి కారణం అయింది.
కర్ణాటక బీజేపీ నేత, కేంద్రమంత్రి వీ సోమన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో నిర్వహించిన బీజేపీ, జేడీఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అందులో మాట్లాడిన వీ సోమన్న.. అద్వానీ మరణించారని పేర్కొన్నారు. అంతేకాకుండా అదే సభలో అద్వానీకి శ్రద్ధాంజలి కూడా ఘటించారు. అయితే వెంటనే ఆయనకు మరో సమాచారం అందింది. అద్వానీ క్షేమంగా ఉన్నారని.. ఆయన చనిపోలేదని బీజేపీ కార్యకర్తలు వెల్లడించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో.. వీ సోమన్నపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రి పదవిలో ఉండి.. సరైన సమాచారం లేకుండా అద్వానీ లాంటి వ్యక్తి ఆరోగ్యం గురించి ఇలాంటి వార్తలు చెబుతారా అంటూ కార్యకర్తల్లోనే కాకుండా నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీయడంతో ఎట్టకేలకు కేంద్రమంత్రి వీ సోమన్న మరోసారి స్పందించారు. తనకు తప్పుడు సమాచారం వచ్చినందునే అద్వానీ చనిపోయారని చెప్పానని.. అందుకే శ్రద్ధాంజలి ఘటించినట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయిన నేపథ్యంలో ఆయన క్షమాపణలు చెప్పారు.
ఇటీవల అనారోగ్యానికి గురై రెండుసార్లు ఆస్పత్రిలో చేరిన అద్వానీ.. చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత నెల 26 వ తేదీన తొలిసారి ఆస్పత్రిలో చేరిన అద్వానీకి ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు సర్జరీ చేశారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన ఆయన.. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈసారి ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో గత బుధవారం చేరారు. అయితే అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన డాక్టర్లు చికిత్స తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేశారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో.. గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన అద్వానీ.. ఆ తర్వాత వయసు మీద పడటంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇక ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నతో సత్కరించింది. భారతరత్న అవార్డును ఆయన నివాసానికి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అందజేశారు. 1927 నవంబరు 8 వ తేదీన విభజనకు ముందు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీలో అద్వానీ జన్మించారు. 1942 లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరిన అద్వానీ.. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. బీజేపీ బలోపేతం కావడంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఆ పార్టీకి అత్యధిక కాలం జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిగా నిలిచారు. ఇక దేశంలో అయోధ్య రామమందిర ఉద్యమానికి.. రథయాత్రతో పునాదులు వేశారు.