మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమికి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. మహాయుతి కూటమి నేతలందరికీ అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహారాష్ట్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని, అందుకే మహారాష్ట్ర ప్రజలు మరోసారి పట్టం కడుతున్నారని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు.‘ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి చరిత్రాత్మక విజయం అందించిన ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు.
ప్రజల ఆకాంక్షలకు కట్టుబడి, మహారాష్ట్ర సమగ్ర పురోగతికి ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది’’ అని గడ్కరీ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రాభివృద్ధి మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నారు. ఇంతటి ఘనవిజయం కోసం శ్రమించిన ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, సీఎం ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎం ఫడణవీస్, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్, భాజపా, మహాయుతి నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.