పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో రికార్డుల తారుమారు, సర్పంచ్ అందుబాటులో లేకపోవటంపై మంగళవారం డీఎల్‌పీవో స్వరూపరాణి విచారణ నిర్వహించారు. ఇటీవల గ్రామస్తులు కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు నెల నుంచి గ్రామంలో అందుబాటులో లేరని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంచినీరు అందక శానిటేషన్ సక్రమంగా చేయకపోవటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీన సచివాలయంలో గ్రామసభ నిర్వహించినా సర్పంచ్ ఆ రోజు కూడా అందుబాటులో లేరని చెప్పారు. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ కూడా గ్రామసభకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలలో ఉండాల్సిన రికార్డులు, అకౌంట్ పుస్తకాలు, సమావేశ తీర్మానాలు, గ్రామసభ పుస్తకాలు, బ్యాంక్ పాస్ పస్తుకాలు, చెక్ బుక్కుల వంటి రికార్డులను గ్రామ కార్యదర్శి ఆధీనంలో ఉండాల్సివుండగా సర్పంచ్ నాగమల్లేశ్వరరావు రికార్డులు తీసుకువెళ్లారని పంచాయతీ అధికారులు చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రికార్డులన్నీ బిల్ కలెక్టర్ వాకా శ్రీనివాసరావు సర్పంచ్‌కు అందచేశారని ఆరోపించారు. పంచాయతీ నిధులు అన్నింటిని దొంగ బిల్లులతో దారిమళ్లించి అవినీతికి పాల్పడుతున్నారని తాము ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. వీటన్నింటిపై మంగళవారం డీఎల్‌పీవో పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు. కార్యదర్శి రవిబాబు అనారోగ్యంతో బాధపడుతుంటంతో బిల్ కలెక్టర్ వద్ద రికార్డులు అన్నీ భద్రపరిచినట్లు సమాధానం ఇవ్వటంతో బిల్ కలెక్టర్‌ను ప్రశ్నించారు. బిల్‌కలెక్టర్ శ్రీనివాసరావు పొంతన లేని సమాధానాలు ఇవ్వటంతో డీఎల్‌పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మూడు రోజుల లోగా రికార్డులు అందచేయాలని ఆదేశించారు. విచారణ జరుగుతుండగానే ఓ వ్యక్తి కొన్ని రికార్డులను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పంపాడని కార్యాలయంలోకి తీసుకురాగా డీఎల్‌పీవో వీడియో రికార్డింగ్ చేయించారు. పంచాయతీలో ఉండాల్సిన రికార్డులు బయటకు తరలించటంపై నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. అలాగే నెలరోజులకు పైగా సర్పంచ్ గ్రామ ప్రజలకు అందబాటులో లేకుండాపోవటంపై కూడా నివేదిక రూపొందించనున్నట్లు చెప్పారు.