దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తాడేపల్లి కృష్ణా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల జీతం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేసీ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు లోకేశ్‌ను కోరారు. పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేయాలని మెల్లెంపూడికి చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన సతీమణి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని మంగళగిరి ఉడా కాలనికి చెందిన షేక్ మౌలాలి కోరారు. తమ ప్రాంతంలో తాగునీటి సరఫరాతోపాటు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని ఆత్మకూరులోని సీతారామ అపార్టుమెంట్ వాసులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై న్యాయవిచారణ జరిపించి తక్షణమే వైస్ చాన్స్‌లర్‌ను నియమించాలని విశాఖకు చెందిన ఏపీబీసీ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా నాగులాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తున్న తనను గత ప్రభుత్వం అకారణంగా తొలగించిందని తిరిగి ఉద్యోగం కల్పించాలని ఎన్ మహేశ్వరి కోరారు. శ్రీశైలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్న తనకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని డీసీ ఉన్నూరు సాహెబ్ కోరారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణతోపాటు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని అర్హత పత్రాలు మంజూరు చేయాలని, ఆర్‌ఎంపీ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ ప్రతినిధులు కోరారు.