అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయమైన అబ్బాయి కోసం ఇద్దరు బాలికలు జిల్లా దాటి వెళ్లారు. స్కూల్‌కి వెళ్తున్నామని చెప్పి.. అదృశ్యమయ్యారు. పోలీసుల రంగంలోకి దిగడంతో వారి అదృశ్యానికి గల కారణం తెలిసింది. ఈ క్రమంలో బాలికల ఆచూకీ కనుగొని.. వారిని క్షేమంగా తమ తమ ఇళ్లకు చేర్చారు పోలీసులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయమైన ఓ యువకుడి మాయ మాటలు నమ్మి ఇద్దరు బాలికలు ఇల్లు విడిచి 120 కిలోమీటర్ల దూరం వెళ్లారు. పాఠశాలకు వెళ్లిన బాలికలు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాలకు వెళ్లి అడగ్గా.. వారు రాలేదని చెప్పారు. దీంతో అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల చొరవతో ఎట్టకేలకు ఇద్దరు అమ్మాయిలు క్షేమంగా ఇల్లు చేరారు.పొదలకూరు మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు బాలికలు స్నేహితులు. వీరు సంగంలోని ఓ పాఠశాలలో ఒకరు పది, మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ క్రమంలో సోమవారం పాఠశాలకని ఇంటి వచ్చిన వారు అదృశ్యమయ్యారు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు పాఠశాలలో విచారించారు. ఇద్దరూ పాఠశాలకు రాలేదని తేలింది. అయితే, వారిలో ఓ బాలిక తన తల్లి ఫోన్‌ను వినియోగిస్తుంది. అనుమానంతో ఫోన్‌ను పరిశీలించగా.. ఓ యువకుడితో ఇన్‌స్టాగ్రమ్‌లో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. ఆ ఫోన్ నెంబర్‌తో పోలీసులను సంప్రదించారు. వెంటనే పోలీసులు ఫోన్ సిగ్నల్‌ను కనిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు కడప జిల్లా సింహాద్రిపురం వద్ద సిగ్నల్ ఆచూకీ లభ్యమైంది. ఆ యువకుడి పేరు శివప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. ఫోన్‌లో యువకుడితో మాట్లాడటంతో ఇద్దరు బాలికలు అక్కడికి చేరినట్లు నిర్ధారించారు. వెంటనే సంగం పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు ఇద్దరు బాలికలను సింహాద్రిపురం బస్టాండ్‌లో ఓ కూరగాయల దుకాణం వద్ద వదిలేశాడు. సింహాద్రిపురం పోలీసులు ఆ బాలికల వద్దకు చేరుకుని.. వారిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు.. సోమవారం అర్థరాత్రి సింహాద్రిపురం బయలుదేరి వెళ్లారు. పోలీసుల చొరవతో ఇద్దరు బాలికలు క్షేమంగా ఇంటికి చేరారు. కాగా, బాలికలను మాయలో పడేసిన ఆ యువకుడు పరారీలో ఉన్నాడు. ఆ యువకుడికి గతంలోనే వివాహమై.. భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.