కాఫర్ డ్యాంల పటిష్ఠత తెలుసుకోవడం కోసం వాటికి మూడు మీటర్ల దూరం వరకు భారీలోతులో బోర్‌వెల్స్‌ను వేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అంతర్జాతీయ నిపుణులు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాల సామర్థ్యం, డయాఫ్రం వాల్ మరమ్మతులు, కాఫర్ డ్యాంలలో సీపేజీ నివారణ మొదలైనవి పరిశీలించి తగు సూచనలు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ అమెరికాకు చెందిన ప్రాజెక్టు నిర్మాణ నిపుణులు జియాన్ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్ బి పాల్.. కెనడా నిపుణులు సీన్ హించ్‌బెర్గర్, రిచర్డ్ డొనెల్లీని నియమించిన సంగతి తెలిసిందే. గత నెల 30వ తేదీన పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చిన వీరు.. దెబ్బతిన్న కట్టడాలను ఈ నెల మూడో తేదీ దాకా క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. ఈ నెల నాలుగో తేదీన తమ దేశాలకు వెళ్లారు. ఈ నెల 8వ తేదీన పీపీఏకి తమ ప్రాథమిక పరిశీలనలను పంపారు. ఆ అభిప్రాయాలను కేంద్ర జల సంఘానికి పీపీఏ పంపింది. వాటిని పరిశీలించిన జలసంఘం.. ఈ సూచనలను పాటించాల్సిందిగా రాష్ట్ర జల వనరుల శాఖకు తెలియజేయాలని బుధవారం పీపీఏని ఆదేశించింది. నిపుణులు తమ ప్రాథమిక నివేదికను ఈ నెల 16వ తేదీన పంపే వీలుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16 తేదీ నాటికి మొదటి ప్రాథమిక నివేదికను పంపేలా ప్రయత్నిస్తామని నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ సలహాలు ఆధారంగా కాఫర్ డ్యాం మరమ్మతు పనులకు, సీపేజీని తగ్గించేందుకు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు సమాయత్తమవుతున్నారు.