తిరుమలలో ఓ భక్తురాలిపై చెట్టుకొమ్మ విరిగిపడి తీవ్రంగా గాయపడ్డారు. కొండపై ఉన్న జపాలి హనుమాన్ ఆలయానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ యువతి జపాలి ఆంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చారు.. రోడ్డుపై ఆమె నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో ఓ చెట్టుకొమ్మ విరిగి ఆమెపై పడటంతో కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో యువతి తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఓ భక్తుడు అదే సమయంలో వీడియో తీయడంతో ఈ ఘటన బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారిని 65,392 మంది భక్తులు దర్శించుకోగా.. 29,015 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.23 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా.. దాదాపు 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులుతెలిపారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతోంది.
తిరుమల శ్రీవారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ అధ్యక్షులు రాఘవ దీక్షితులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ మరియు టిటిడి ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ మరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
వైఖానస భగవత్ శాస్త్రం వేదంతో కూడినదని దేవాలయ సంస్కృతికి మూలమైన వేదమంత్రాలతో జరిపే వైఖానస ఆరాధన తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనదని చెప్పారు రాఘవ దీక్షితులు. వేల సంవత్సరాలుగా శ్రీవారికి పూజలు ఉత్సవాలు శ్రీ వైఖానస ఆగమం ప్రకారం జరుగుతున్నాయని, ఈ ఆగమ శాస్త్రాన్ని శ్రీ మరిచి మహర్షి విమానార్చనకల్పం, ఆనంద సహిత గ్రంథాలలో విధివిధానాలతో సమగ్రంగా వివరించారని తెలిపారు.
శ్రీ మరీచి మహర్షి అందించిన శాస్త్ర గ్రంథాలపై పరిశోధనలు జరిపి, అందులోని ఆగమ శాస్త్ర ప్రాధాన్యతను, సమాజ హితాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నారు సనత్ కుమార్. దేవాలయ, మండపాల నిర్మాణాలను, నిత్య పూజలు, ఆరాధనలు విధివిధానాలు వంటి ఎన్నో శాస్త్ర విషయాలను సమగ్రంగా అందించారని చెప్పారు. దేవాలయ నిర్మాణమే సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందని వివరించారు.
మరీచి మహర్షి ఉపదేశించిన విషయాలు, శ్రీ కల్ప సూత్రాల ఆధారంగా రూపొందించబడ్డాయని చెప్పారు ఎస్వి వేద విశ్వవిద్యాలయం ఆగమ శాస్త్ర ఆచార్యులు భవనారాయణాచార్యులు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడిందని ఈ ఉత్సవ నిర్వహణ, సందర్శన వల్ల భక్తులకు అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందని తెలిపారు. తరతరాలుగా బృహత్తరమైన ఈ శాస్త్ర ఆచరణలో వైఖానస అర్చక సమాజం బృహత్తర బాధ్యత పోషిస్తుందన్నారు.
భారతీయ సంస్కృతికి మూలం వేదాలు, ఆగమ శాస్త్రాలని, సమాజంలోని మానవాళిని ధర్మం మార్గంలో నడిపిస్తున్నాయన్నారు వైఖానస ట్రస్ట్ ట్రస్టీ శ్రవణ్ కుమార్ . శ్రీ మరీచి మహర్షి అందించిన దేవాలయ సంస్కృతి మహోన్నతమైందని వివరించారు. అనంతరం శ్రీ వైఖానస ట్రస్ట్ కార్యదర్శి శ్రీ ప్రభాకర్ ఆచార్యులు ప్రసంగిస్తూ దేవాలయాల విశిష్టత, అర్చన, పూజ విధానాలను వివరించారు. అంతకుముందు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు స్తోత్ర పఠనంతో మంగళ నిరాజనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారి పురుషోత్తం, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.