ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ కార్యాలయంలో రూరల్ డెవలప్‌మెంట్‌పై పవన్ సమీక్ష నిర్వహించారు. సాలిడ్, లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ – ఎస్ఎల్ఆర్ఎం వర్క్ షాపులో అధికారులు ఎస్ఎల్ఆర్ఎంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భీమవరం, పిఠాపురం, గొల్లప్రొలులో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు. చెత్త నుంచి వివిధ ఉత్పతులకు ముడి సరుకు తయారు చేయొచ్చని.. డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్టుతో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును రూపొందించామని ఎస్ఎల్ఆర్ఎం అంటోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును అమలు చేస్తే రూరల్ ప్రాంతంలో ఏడాదికి రూ.2,600 ఆదాయం వస్తుందన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు చిన్న చిన్న గ్రామాల్లో మాత్రమే ఈ ప్రాజెక్టును అమలు చేశారని.. భీమవరం డంపింగ్ యార్డ్‌లో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు అమలు చేస్తున్నారన్నారు. చెత్తలో కూడా ఐశ్వర్యం ఉందని చెప్పడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు డిప్యూటీ సీఎం. పంచాయతీలకు డబ్బులు లేవని.. పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేశాయని విమర్శించారు. సర్వీస్ అంటే ఎవరూ ముందుకు రారని.. చెత్తతో సంపద వస్తుంది అంటేనే ముందుకు వస్తారన్నారు.
అయితే అన్ని అనర్ధాలకు ఒక ఐఏఎస్ కారణమన్నారు పవన్ కళ్యాణ్. తాను ఏ సమీక్ష నిర్వహించినా ఆయనే కారణమని చెబుతున్నారని.. కానీ ఆయన ఇప్పుడు సర్వీసులో లేరన్నారు. ఇప్పుడు ఎవరిని బాధ్యులను చేయాలి, నిధులు ఎలా రికవరీ చేయాలి? అంటూ ప్రశ్నించారు.. కేవలం కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలకు రాష్ట్ర వాటా ఇవ్వలేదని.. కేంద్రం సైతం నమ్మకం లేక నిధుల్ని నిలిపివేసిందన్నారు. గత ప్రభుత్వం నిధుల్ని మళ్లించిందని.. ముందు ఖర్చు చేస్తే తర్వాత బిల్లులు ఇస్తామని చెప్పారని.. రోడ్లు వేసిన కాంట్రాక్టర్‌లకు సైతం డబ్బులు ఇవ్వలేదన్నారు. అన్ని వ్యవస్థల్లో, శాఖల్లో, పథకాల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు ఎన్నో ఉన్నాయని..వీటిని పెట్టుకుని వెంటనే అన్నీ చేయాలంటే తమకు సాధ్యం కాదన్నారు.
కొంతమంది పంట కాలువలను డంపింగ్ యార్డులుగా మార్చేస్తున్నారని.. ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారేయడం దారుణమన్నారు పవన్ కళ్యాణ్. ఆ కవర్లను తిని గోవులు చనిపోతున్నాయని.. గోమాతల్ని పూజించడమే కాదు బాగోగులు కూడా చూడాలన్నారు. తన పార్టీ ఆఫీస్, తన క్యాంపు ఆఫీస్, తన నియోజకవర్గంలో తాను ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును మొదలు పెడతానని.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా కొన్ని మార్పులు తీసుకు వస్తామన్నారు. అలాగే బ్లీచింగ్ పౌడర్‌కే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి ఉందని.. పంచాయతీకి నిధులు సమకూర్చే సవాల్‌ను స్వీకరించి అడుగులు వేస్తామన్నారు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావన్నారు.