ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. అమరావతి సచివాలయానికి వెళుతున్న సమయంలో రోడ్డుపై ప్రజలు నిలబడి ఉండటాన్ని గమనించారు.. వెంటనే కాన్వాయ్‌ను ఆపి వారిని పలకరించారు. ప్రజలు సీఎంకు వినతి పత్రాలు అందజేశారు.. తమ సమస్యల్ని విన్నవించారు. ఈ సందర్భంగా నక్సల్స్ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబసభ్యులు కూడా చంద్రబాబును కలిశారు. సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం.. సోమ కుమారుడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
మరోవైపు అరకు సర్చంచ్ శ్రీనివాస్ కూడా చంద్రబాబును కలిశారు. తాను గత ప్రభుత్వం హయాంలో సర్వస్వం కోల్పోయానని.. ఆదుకోవాలని కోరగా.. సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మిగిలిన అందరి దగ్గరకు వెళ్లి వినతి పత్రాలను చంద్రబాబు తీసుకున్నారు. అందరి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌లో వినతి పత్రాలు తీసుకునేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఎవరైనా అక్కడికి వెళ్లి వినతి పత్రాలు అందించొచ్చని తెలిపారు.
మరోవైపు చంద్రబాబు ప్రతి శనివారం తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌కు వెళుతున్నారు. అక్కడ ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు.. పార్టీ నేతలకు చంద్రబాబు అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివసరావు కీలక ప్రకటన చేశారు. ప్రజల నుంచి వినతుల స్వీకరించేందుకు కొత్తగా టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో.. సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనాలు భారీగా తరలివస్తున్నారని గుర్తు చేశారు. అందరి నుంచి వినతుల స్వీకరించేందుకు.. ఆ విధానాన్ని సులభతరం చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. అంతేకాదు ప్రజలు వారి సమస్యలను 73062 99999 నంబర్‌కు కాల్ చేసి తెలియజేయొచ్చని.. ఆ సమస్యను బట్టి, ప్రాధాన్యతను బట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు.