మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఒక ప్లాన్ ప్రకారమే తప్పుడు కేసు నమోదు చేశారని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ మండిపడ్డారు. రఘురామ రాజు ఆరోపణలపై, కేసును పోలీసులు స్వీకరించిన పరిణామాలపై పొన్నవోలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైయస్ జగన్ తోపాటు మరికొందరు అధికారులపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. కేవలం దురుద్దేశంతో, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారు. వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామ కృష్ణంరాజు ఈ పని చేశారు. అరెస్ట్ చేశాక తనని కస్టడీలో వేధించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. కానీ, అయన్ని అరెస్టు చేసిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు. తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామ మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో కేసులో ఏకంగా మాజీ సీఎం జగన్ పేరు రాశారు. కేవలం జగన్ పై రఘరామ ద్వేషం పెంచుకుని మూడేళ్ల తర్వాత ఈ కేసు పెట్టారు. అధికారులు పీవీ సునీల్, సీతారాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదు? డాక్టర్లు కూడా రఘురామ ఒంటిపై కొట్డిన గాయాలు లేవని చెప్పారు. అయినాసరే అత్యంత దారుణంగా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు. రఘురామ జూన్ 11వ తేదీన ఫిర్యాదు చేస్తే.. 10వ తేదీనే పోలీసులు ఎలా లీగల్ ఒపీనియన్ కి రాశారు?. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయటానికి చేసిన కుట్ర అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి? అని పొన్నవోలు అన్నారు. పైగా.. ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యాన్నే చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని, మరి మూడేళ్ల తర్వాత రఘురామ కేసులో జగన్, ఇతర అధికారులపై ఎలా కేసు నమోదు చేస్తారు? అని పొన్నవోలు నిలదీశారు. రాష్ట్రంలో అత్యంత దారుణంగా హత్యలు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయని పరిస్థితి చూస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఎవర్నో ఇబ్బందులు పెట్టాలన్న కక్ష్యతోనే ఇలాంటి తప్పుడు కేసు పెట్టారని, ఇలాంటి తప్పుడు ఒరవడినే అవలంభిస్తే రాబోయే రోజుల్లో కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని అన్నారాయన. ‘‘రెడ్ బుక్ రాసుకుని అధికారాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడవద్దు. అదే జరిగితే అధికారులు ఎవరూ సరిగా ఉద్యోగం చేయలేరు. కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు మానుకోవాలి అని పొన్నవోలు హితవు పలికారు.