థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వచ్చే బూడిద(ప్లైయా్‌ష)ను రహదారి మరమ్మతులకు ఉపయోగించే అంశంపై పైలెట్ అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌అండ్‌బీకి సూచించారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు బూడిదను ఉపయోగించాలని ఈ నెల 2న జరిగిన సమావేశంలో సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 రహదారులపై ఈ ప్రయోగం చేశారు. విజయవాడలోని నున్న బైపాస్, నెల్లూరు ఎన్‌పీఎస్ రోడ్డు, ప్రొద్దుటూరు రహదారులపై ప్రయోగాత్మకంగా బూడిద వినియోగంతో గుంతలు పూడ్చారు. అయితే, ఆ ప్రయోగం పూర్తిగా విజయవంతం కాలేదు. గుంతలను పూడ్చేందుకు ఉపయోగించిన బూడిద బిట్‌మెన్, ఇతర మెటల్‌తో మిక్సింగ్ కావడం లేదు. దీంతో పొడివాతావరణంలో ఆ బూడిద వాహనాల రాకపోకలతో గాల్లోకి లేస్తోంది. ఈ ప్రయోగంపై ఆర్‌అండ్‌బీ ప్రజల నుంచి స్పందన కోరగా ప్రతికూలంగా వచ్చింది. ఇదే విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇద్దరు సీఆర్‌ఐఐకి చెందిన ఐఐటీ నిపుణులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైన్లోకి తీసుకొని మాట్లాడారు. వారు ఇచ్చిన సూచనలతో బూడిద వినియోగంపై పైలెట్ అధ్యయనం చేయాలని సూచించారు. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, సీఆర్‌ఆర్‌ఐ, ఢిల్లీ, ఎస్‌ఆర్‌ఎమ్ యూనివర్సిటీ అమరావతి నిపుణుల సహకారంతో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.