బీజేపీ నాయకులకు సొంతపార్టీ సీనియర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులనే మనమూ చేస్తే అధికారంలోకి వచ్చి ప్రయోజనం ఏముందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ భిన్నమైన పార్టీగా ఉందని, అందుకే అది పదేపదే ఓటర్ల విశ్వాసాన్ని చూరగొంటోందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. గోవాలో శుక్రవారం జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసే పనిని మనం కొనసాగిస్తే, అధికారం నుంచి వారి నిష్క్రమణ, మన ఎంట్రీ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు’ అని గడ్కరీ హెచ్చరికలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడ్కరీ బీజేపీని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించిన గడ్కరీ.. తన రాజకీయ గురువు, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని గుర్తుచేసుకున్నారు. బీజేపీ భిన్నమైన పార్టీ అని అన్న అద్వానీ ప్రకటనను ఆయన ప్రస్తావించారు. ‘మనది భిన్నత్వం ఉన్న పార్టీ అని అద్వానీ చెప్పేవారు... మిగతా పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామో అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ తప్పులు చేసిందనే బీజేపీని ప్రజలు ఎన్నుకున్నారని, మనం అటువంటి తప్పిదాలను చేయొద్దని హెచ్చరించారు.
‘మనం అంటువంటి తప్పులనే చేస్తే వారి నిష్క్రమణ.. మన ఎంట్రీ వల్ల ప్రయోజనం లేదు.. అందుకే సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి రాజకీయాలు ఒక సాధనమని రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాలి.. మనం అవినీతి రహిత దేశాన్ని సృష్టించాలి.. దాని కోసం, మనకు ఒక ప్రణాళిక ఉండాలి’ అని గడ్కరీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తన సొంత రాష్ట్రంలో మహారాష్ట్రలో కుల రాజకీయాల ధోరణిపై ధ్వజమెత్తారు.
‘నేను ఈ ధోరణిని అనుసరించకూడదని నిర్ణయించుకున్నాను. నేను కుల రాజకీయాలకు పాల్పడనని ప్రజలకు చెప్పాను... కులం గురించి మాట్లాడేవారిని అధికారం నుంచి తరిమికొడతారు... ఒక వ్యక్తికి అతడి విలువలను బట్టి గుర్తింపు వస్తుంది కానీ కులాన్ని బట్టి కాదు’ అని అన్నారు. ఈ సమావేశంలో గోవా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సదానంద్ తనవాడే, సీఎం ప్రమోద్ సావంత్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గానికి వెళ్లి, ప్రజలతో మమేకమై 2027 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం కొనసాగించేలా పార్టీని బలోపేతం చేయాలని శ్రేణులకు నితిన్ గడ్కరీ సూచించారు.