ఒడిశాలో శనివారం ఉదయం యాత్రికులు బస్సు ప్రమాదానికి గురయ్యింది. జాతీయ రహదారి 18పై జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది గాయపడ్డారు. బరిపద బుదిఖామర్ ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన 23 మందితో వెళ్తోన్న టూరిస్ట్ బస్సు బోల్తాపడింది. వీరంతా ఉత్తర భారతంలోని కాశీ, గయ వంటి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు బస్సు ఓవైపున పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘బుదిఖామర్ ప్రాంతంలో టూరిస్ట్ బస్సు బోల్తాపడినట్టు ఉదయం సమాచారం అందింది.. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాం.. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నాం.. కునుకుపాటుతో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయి ఉంటాడు’ అని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. బాధితులంతా హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించినట్టు పేర్కొన్నారు.
ట్రావెల్స్ బస్సును బుక్‌చేసుకుని వీరంతా తీర్థయాత్రకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం కోసం బరిపడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం భువనేశ్వర్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు.
ప్రమాదంలో డ్రైవర్ సహా ముగ్గురు చనిపోయారని ఒడిశా పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయానికి బస్సులో 30 మంది వరకూ ఉన్నట్టు సమాచారం. బాధితులు హైదరాబాద్‌లోని పాతబస్తీలోని ఛత్రినాక ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. ప్రమాదం గురించి వారి కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో పలువురు హైదరాబాద్ నుంచి ఒడిశాకు బయలుదేరారు. కాగా, ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు.