దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జూన్ 10న ఈ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళిని బట్టి ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 4 స్థానంలో గెలుపొంది.. మరో 7 చోట్ల ఇండియా కూటమి ముందంజలో ఉండగా.. ఎన్డీయే కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే , విపక్ష ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి ఉప-ఎన్నికలు కావడంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పశ్చిమ బెంగాల్‌లో ఉప-ఎన్నికలు జరిగిన నాలుగు చోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు స్థానాలకుగానూ ఆ పార్టీ రెండు చోట్ల.. బీజేపీ ఒక స్థానంలో లీడ్‌లో ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని రెండు (బద్రీనాథ్, మంగలూరు) స్థానాల్లోనూ కాంగ్రెస్, పంజాబ్ (జలంధర్ వెస్ట్) ఆమ్ ఆద్మీ పార్టీ బిహార్ (రూపౌలి)లో ఇండిపెండెంట్, తమిళనాడు (విక్రవాండి)లో డీఎంకే, మధ్యప్రదేశ్ (అమ్రవారా)లోని కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.
ఉప-ఎన్నికలు జరిగిన మొత్తం ఏడు రాష్ట్రాలకు గానూ నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడుచోట్ల ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. బిహార్‌లోని రూపౌలి స్థానంలో జేడీయూ అభ్యర్థి కళాధర్ ప్రసాద్ మండల్, స్వతంత్ర అభ్యర్ధి శంకర్ సింగ్ మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్ధి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని డేహ్రాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమలేశ్ ఠాకూర్ 9 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. హమీర్‌పూర్‌లో బీజేపీ నుంచి ఆశిష్ శర్మ.. కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ పుష్పేంద్ర కుమార్‌పై 1,453 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నలగఢ్‌లో కాంగ్రెస్ నేత హరదీప్ సింగ్ బవ.. తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి కేఎల్ ఠాకూర్‌ను 6 వేల పైచిలుక ఓట్లతో ఓడించారు. తమిళనాడులోని విక్రావండిలో డీఎంకే నుంచి శివ షణ్ముగం భారీ మెజార్టీ దిశగా సాగుతున్నారు.
ఇక, పంజాబ్‌లోని జలంధర్ ఆప్ నేత షీతల్ భగవత్ 37 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పశ్చిమ్ బెంగాల్‌లోని మానిక్‌తలా, బాగ్దా, రాణాఘాట్ దక్షిణ్, రాయ్‌గంజ్.. మొత్తం నాలుగు స్థానంలో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వారంతా బీజేపీ అభ్యర్థులపై భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.