ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.. మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ధైర్యం చెప్పి.. స్వయంగా ఆస్పత్రికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ బాలుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి సవిత అటుగా వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన సంగతిని గమనించిన మంత్రి.. వెంటనే కాన్వాయిని ఆపాలని సిబ్బందికి సూచించారు. కారు దిగి వచ్చి.. గాయపడినవారిని పరామర్శించారు.
గాయపడిన మహిళను పరామర్శించిన మంత్రి నీళ్లు తాగించి.. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం దగ్గర ఉండి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి సకాలంలో స్పందించిన తీరును పలువురు అభినందిస్తున్నారు. ప్రజాప్రతినిధులంటే ప్రజలకు సేవ చేసేవారనే నిజాన్ని మంత్రి ఆచరణలో చూపారని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు సవిత. మాజీ మంత్రి, వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ మీద 33 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమెకు చంద్రబాబు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. బీసీ సంక్షేమ శాఖ, చేనేత, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రిగా నియమించారు. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శాఖపై తన ముద్ర వేస్తున్నారు మంత్రి. సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేస్తూ.. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే అవసరమైతే తనను సంప్రదించాలంటూ ఫోన్ నంబర్ కూడా ఇస్తూ సమస్యల పరిష్కారం కోసం మంత్రి సవిత కృషి చేస్తున్నారు.