ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. అలాగే భారతదేశంలోని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణితో కలిసి ఈ పెళ్లి వేడుకలకు వెళ్లారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముంబైలో జరిగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు.
అయితే వేడుకల నుంచి చంద్రబాబు తిరిగి బయల్దేరిన సమయంలో చంద్రబాబుకు ముకేష్ అంబానీ వీడ్కోలు పలికిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బయట వరకూ వచ్చి కారులోని చంద్రబాబుకు నమస్కరించి ముకేష్ అంబానీ వీడ్కోలు పలికిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబు కారు ఎక్కిన బయల్దేరిన తర్వాత ముకేష్ అంబానీ నమస్కరించి వీడ్కోలు చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. అదీ చంద్రబాబు రేంజ్ అని అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. ముకేష్ అంబానీ అతిథులను గౌరవించే విధానం బాగుందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరోవైపు ముంబై పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయ్యారు. షిండే నివాసానికి వెళ్లిన చంద్రబాబు..దాదాపు అరగంట పాటు ఆయనతో చర్చించారు. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఇరు రాష్ట్రాల మధ్య సహకారం, ఆర్థిక అంశాల మీద ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం ద్వారా రాష్ట్రాలను ఎలా అభివృద్ధి చేయవచ్చనే దానిపై చర్చ జరిగినట్లు ఏక్‌నాథ్ షిండే ట్వీట్ చేశారు. అయితే ఈ టీడీపీ,శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) పార్టీలు రెండూ ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కూటమి రాజకీయాలు కూడా చర్చకు వచ్చి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.