అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్‌పైన థామస్ మాథ్యూ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్‌కు గాయాలయ్యాయి. మరోవైపు ఘటన అనంతరం అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. కాల్పులు జరిపిన వ్యక్తిని మట్టుబెట్టారు. అయితే ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ట్రంప్‌పై కాల్పులకు, ఏపీ రాజకీయాలకు ముడిపెడుతూ వైసీపీ ట్వీట్ చేసింది. ట్రంప్ అదృష్టం బాగుండి ఆంధ్రప్రదేశ్‌లో పుట్టలేదని.. పుట్టి ఉంటే మరో రకంగా ఉండేదంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
"అదే మా ఆంధ్రప్రదేశ్‌లో అయితే.. గెలవడం కోసం నువ్వే చేయించుకున్నావని ఇప్పటికే కలిసి నానా వార్తలు వండివార్చేవారు ట్రంపూ. తూటాకాదు, గులకరాయి అని, గుండు సూదితో గుచ్చారని ఇలా అద్భుతమైన వార్తలు రాసేవారు. నిందితుడిని పోలీసులు కాల్చిచంపే బదులు బెయిల్ వచ్చేలా చేసేవారు. ఆ నిందితుడితో కలిసి నారా లోకేష్ ఫొటోకూడా దిగేవాడు. మీ అదృష్టం బాగుండి ఇక్కడ పుట్టలేదు." నారా లోకేష్ ఫోటోను, ట్రంప్‌పై కాల్పుల ఘటనకు సంబంధించిన వార్తా కథనాన్ని వైసీపీ తన ట్వీట్‌కు జోడించింది.
మరోవైపు ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో అప్పటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కూడా దాడి జరిగింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడకు వచ్చిన వైఎస్ జగన్ మీద.. రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో వైఎస్ జగన్ ఎడమ కన్ను పైభాగంలో గాయమైంది. అలాగే పక్కనే ఉన్న వెల్లంపల్లికి కూడా గాయమైంది. అయితే వైఎస్ జగన్ ఆ తర్వాత స్టిక్కర్ వేసుకుని ఎన్నికల ప్రచారం కొనసాగించటంతో టీడీపీ, జనసేన నేతలు విమర్శలు గుప్పించారు. గులకరాయితో దాడి చేస్తే అయిన చిన్న గాయానికి ప్లాస్టర్ వేసుకుని... సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు ఘటనకు, ఏపీ రాజకీయానికి ముడిపెడుతూ వైసీపీ ట్వీట్ చేసింది.
అలాగే వైఎస్ జగన్ మీద రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్.. లోకేష్‌తో కలిసి ఫోటో దిగారంటూ సోషల్ మీడియాలో వార్తలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోను కూడా వైసీపీ తన ట్వీట్‌కు జతచేసింది. మరి టీడీపీ వైపు నుంచి వైసీపీ ట్వీట్‌కు ఎలాంటి కౌంటర్ వస్తుందనేదీ చూడాలి మరి.