ఏపీలోని పాడి, పౌల్ట్రీ రైతులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. పశువులు, కోళ్ల షెడ్ల నిర్మాణానికి రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పశువుల షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీ ఇవ్వాలని డిసైడ్ కాగా.. గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ రాయితీ ద్వారా ఆయా రైతులకు భారీగా లబ్ధి చేకూరనుంది. రైతులకు యూనిట్‌కు గరిష్ఠంగా రూ.60,900 నుంచి రూ.2,07,000 వరకు లబ్ధి చేకూరనున్నట్లు అధికారులు వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
వైకాపా పాలన కంటే ముందు 2014- 2019 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ‘గోకులం’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ పథకాన్ని నిలిపివేశారు. అయితే అప్పటికే షెడ్లు నిర్మించుకున్న కొందరి రైతులకు రాయితీ సొమ్ము అందలేదు. తాము అధికారంలోకి వచ్చాక 'గోకులం' పథకాన్ని తిరిగి అమలు చేస్తామని ప్రజాగళం మ్యానిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా.. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
ఇచ్చిన హామీ మేరకు షెడ్ల నిర్మాణానికి రాయితీ మంజూరు చేస్తూ తాజాగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి జులై 1న ఉత్తర్వులు, అందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. శనివారం (జులై 13) అందుకు సంబంధించిన వివరాలను ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. ప్రభుత్వం అందించే రాయితీపై పశువుల షెడ్లు, మేకలు, గొర్రెలు, పౌల్ట్రీ షెడ్లు నిర్మించుకునేందుకు అర్హులకు ప్రోత్సాహం కల్పిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ గోకులం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని మంత్రి అచ్నెన్న వివరించారు.