కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులు ఉండవని, వారి గౌరవ మర్యాదలకూ భంగం కలగకుండా చూస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని కురిహినశెట్టి కల్యాణ మండపంలో ఆదివారం ఎమ్మెల్యేకు ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల ఆధ్వర్యంలో సన్మానసభ జరిగింది. కార్యక్రమానికి జేఏసీ కన్వీనర్ కెంచె లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. తొలుత ఎమ్మెల్యేను శాలువా కప్పి, పూలమాలలు వేసి, ముంజేతి కంకణధారణ చేసి ఘనంగా సత్కరించారు. తర్వాత ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల స్నేహభావంతో మెలుగుతూ రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకెళ్తామన్నారు. ముఖ్యంగా భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణాజలాలు అందించడానికి, లక్ష ఎకరాలకు సాగునీరివ్వడానికి కంకణబద్ధుడై ఉన్నానన్నారు. ఉద్యోగులను అణచివేసే ధోరణి కూటమి ప్రభుత్వంలో ఉండదన్నారు. ఉద్యోగులతో స్నేహంగా ఉండి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం, ఉపాధ్యాయుల సంఘం నాయకులు రామాంజనేయులు, పరమేశ్వరప్ప, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.