సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అంబానీ పెళ్లికి వెళ్లే సమయం ఉంది కానీ.. ముచ్చుమర్రిలో బాధితులను పరామర్శించేందుకు టైమ్ లేదా అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ‘ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటన జరిగి వారం గడుస్తున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదు. సీఎం చంద్రబాబు, పవన్‌కు అంబానీ ఇంట్లో పెళ్లికి వెళ్లే సమయం ఉంది కానీ.. బాధితులను పరామర్శించేందుకు సమయం లేదు.రాష్ట్ర హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలోనే బాలిక హత్య జరిగితే బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయి. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. ఏపీలో మహిళలపై దాడులు అరికట్టకపోతే వైయస్ఆర్‌సీపీ ప్రజా పోరాటలకు సిద్ధమవుతుంది అని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత ఇద్దరు పది, ఒకరు ఆరో తరగతి విద్యార్థులు చెబుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు.