మచిలీపట్నాని రూ.58 కోట్లతో అమృత పథకం కింద డ్రెయిన్లు, అభివృద్ధి పనులు చేస్తాం. రూ.70 వేల కోట్లతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ రాబోతోంది. బందరును ఉపాధి అవకాశాల నగరంగా తీర్చిదిద్దుతాం. అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం టీడీపీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బర్ నిర్వహించారు. వర్షం కురుస్తున్నప్పటికీ వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీటీడీ కల్యాణ మండపానికి మరమ్మతులు చేయించాలని పీవీ ఫణికుమార్ తదితరులు వినతిపత్రమిచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘ నాయకుడు తమ్ము నాగరాజు, బి.వి.మల్లికార్జున రావు వినతి పత్రమిచ్చారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు కావాలంటూ ప్రజలు దరఖాస్తులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 16,500 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించామన్నారు. ఆస్పత్రిలో పసికందును అపహరించిన కేసులో నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, గొర్రెపాటి గోపీచంద్, గోపు సత్యనారాయణ, ఇలియాస్‌పాషా పాల్గొన్నారు.