మహానంది క్షేత్రంలో సంవత్సరోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో వేదపండితులు, అర్చకులు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనంతో ప్రారంభించారు. వివిధ రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలతో గర్భాలయం, అంతరాలయంతో పాటు ప్రాకారాలు, గోపురాలు, రాతి స్తంభాలు, మంటపాలు, ధ్వజస్తంభాలను మంత్రపూర్వకంగా, శాస్త్రబద్ధంగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం వేళ తొలి ఏకదశి పర్వదినానికి ముందుగా మహానందిలో ఏటా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ వేదపండితుడు చండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ఎర్రమల్ల మధు, ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసులు యాదవ్, సిబ్బంది, మన గుడి మన ఊరు మన భాధ్యత సేవా సమితికి చెందిన 200 మంది సభ్యులు పాల్గొన్నారు.